‘‘ఇది కాదురా దెయ్యం కథంటే’’ అన్నారు రామ్ సర్.
సండే బుక్‌ని చేత్తో పట్టుకుని దెయ్యం కథ చదువుతుంటే.. రెండు మూడు పేరాలకే ఆ బుక్‌ని అక్కడ పడేసి, భయంతో కేకలు వేస్తూ ఉన్నచోటు నుంచి పరిగెత్తిపోవాలి.. అనేవారు ఆయన.
లేదా..
కథ చదువుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారైనా తలతిప్పి వెనకెవరైనా ఉన్నారేమో భయం భయంగా చూసుకోవాలి.. అనేవారు.
లేదా..
ఒంట్లో వణుకు బయల్దేరాలి, అరిచేతులు చెమట్లు పట్టాలి.. గొంతు తడారిపోవాలి.. పెదవులు ఎండిపోవాలి.. ఇలాగనేవారు.
ఇవేవీ జరక్కున్నా.. కనీసం.. ఈ కథలో దెయ్యం ఎవరు అనే క్వొశ్చన్.. కథ చదువుతున్నంత సేపూ భయంలా వెంటాడాలి.. అనేవారు.
నేను మౌనంగా ఆయన ముఖంలోకి చూసేవాణ్ని.
‘‘దెయ్యం కథ చదివాక దెయ్యం పట్టినట్లు అయిపోవాలి మాధవ్..’’ అనేవారు.
నాకర్థమైంది.
దెయ్యం కథ 13 డివైడెడ్ బై 6 అనే భాగహారంలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ‘దెయ్యం కథ నువ్వెంత అద్భుతంగా రాసినా, అదంతా భాగహారం కుడి చెవిలోని 2 మాత్రమే. అది నాకు అక్కర్లేదు. శేషంగా 1 మిగులుతుంది చూడూ.. అది నాకు కావాలి. అదే నేను కోరుకునే దెయ్యం. ప్రతి కథలోనూ చివరికి శేషంగా ఒక్క దెయ్యమైనా కనిపించాలి. ఆపైన ఎన్ని దెయ్యాలను శేషంగా మిగిల్చినా నీ ఇష్టం’ అని ఆయన నాకు చెబుతున్నారు!
‘‘సరే, ఈ జినియాపువ్వు’ను ఇలా పోనివ్వు. వచ్చేవారం నుంచి నాకు పూలు, చేలు కాదు.. ఒర్జినల్ దెయ్యం కావాలి’’ అని, ఆ వారానికి కరుణించేశారు రామ్ సర్.. రాసిన కథనే మళ్లీ తిప్పి రాయమని అనకుండా.
మొదట నేను కథ రాస్తాను. రాసిన కథను రామ్ సర్ క్యాబిన్‌లోకి తీసుకెళతాను. కథ రాగానే రామ్ సర్ మిగతా స్టాఫ్‌నందర్నీ క్యాబిన్‌లోకి పిలుస్తారు. ‘ఇక చదువు’ అని నా వైపు చూస్తారు. ఆయన చదవరు. చదువుతుంటే కథను ఫీల్ అవుతారు. చదువుతున్నప్పుడే అవసరమైన మార్పులు చెప్పేస్తారు. కథ విన్నాక క్యాబిన్‌లో ఉన్నవాళ్లందరి వైపు చూస్తారు.. ‘ఎలా ఉంది కథ?’ అన్నట్లు. క్యాబిన్‌లో అంతా సహృదయులే కనుక (నా అదృష్టం కొద్దీ కాదు, నా దెయ్యం కథ అదృష్టం కొద్దీ) బాగుందన్నట్లుగా మౌనం వహిస్తారు.
ఆ తర్వాత..
కథ మేకప్ అవడం రెండో దశ. ఇచ్చిన దెయ్యం టెక్స్ట్ ఇచ్చిన దెయ్యం టైటిల్, ఇచ్చిన దెయ్యం ఇలస్ట్రేషన్‌తో డిజైనర్ ఆ దెయ్యం కథను మేకప్ చేస్తారు.
ఆ తర్వాత...
మేకప్ అయిన ఆ దెయ్యం కథ ప్రింట్‌ను ముందేసుకుని చదవడం మూడో దశ. ముందేసుకుని ఎవరు చదువుతారంటే.. ఫన్‌డే సెక్షన్‌లో ఉండే సబ్ ఎడిటర్ ఒకరెవరైనా. జనరల్‌గా ఆ ఒకరెవరైనా ‘నిఖిత’ అవుతుంటారు. తను రిపోర్టర్ కమ్ సబ్ ఎడిటర్.
కథను చదువుతూ చదువుతూనో, చదివేశాకో నిఖిత నుంచి నా ఇంటర్‌కమ్‌కి ఫోన్.. ‘కథ భలే ఉంది సర్..’ అని!
‘‘కథ చదువుతుంటే.. ఎక్కడైనా భయం వేసింది నిఖితా?’’ అని ఆశగా అడిగాను.
‘‘లేదు సార్’’
‘‘తర్వాతేం జరుగుతుంది’’ అనిపించిందా?’’
‘‘లేదు సార్’’
‘‘క్లైమాక్స్ ఏమిటో తెలిసిపోతోందా?’’
‘‘లేదు సార్’’
‘‘మరి?!!’’
‘‘జినియా పువ్వు సర్..’’
నవ్వాను.
కథలోని దెయ్యాన్ని వదిలేసి, కథలోని జినియాపువ్వుతో కనెక్ట్ అయ్యారు నిఖిత.
కథలోని జినియాపువ్వు లాంటి దెయ్యం కాకుండా, దెయ్యం లాంటి జినియాపువ్వు నిఖితను పట్టేసింది అని చెప్పేందుకు లేదు.
జినియాపువ్వు నిఖితకు నచ్చడానికి ఆమె చెప్పిన కారణం వేరే.
(మరో దెయ్యం కథ మళ్లెప్పుడైనా.. కాస్త టైమ్ దొరికినప్పుడు)




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home