Tuesday, September 20, 2022


 












బీచ్‌లో కార్తీక్‌ తనతో గొడవ పడ్డాక ఆమె నేరుగా యశ్వంత్‌ రూమ్‌కి వెళ్లింది. లేట్‌గా వెళ్లినందుకు పరిహారంగా అతడిని గట్టిగా కావలించుకుంది. 

‘‘ఈ అబ్బాయిలేంటో.. స్నేహాన్ని ప్రేమ అనుకుంటారు’’ అని నవ్వింది, బ్యాక్‌ హుక్స్‌ పెట్టుకుంటూ.

‘‘అమ్మాయిలు కూడా..’’ అని నవ్వాడు యశ్వంత్‌ అలసటగా. 

సందర్భం.. పై ‘అల’ కథ లోపలిది. దీని గురించి ఓ రీడర్‌ ఫోన్‌ చేశారు. 

‘‘కావలించుకోడానికి, బ్యాక్‌ హుక్స్‌ పెట్టుకోడానికి మధ్య అనివార్యంగా ఉండే సమయాన్ని మీరు చిన్న ఇండికేషన్‌తోనైనా రిజిస్టర్‌ చెయ్యలేదు. స్కిప్‌ చేసేశారు. రీడర్స్‌కి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కదా!’’ అని!

ఆ మాట నిజం.

జనరల్‌గా.. కావలించుకున్నాక ఆ తర్వాత జరగబోయే పరిణామాల క్రమంలో.. (ఈ కథ ప్రకారం).. హుక్స్‌ తియ్యడం ఉంటుంది తప్ప, హుక్స్‌ పెట్టుకోవడం ఉండదు. అయితే.. హుక్స్‌ పెట్టుకోవడం అని ఎందుకు రాయడం అంటే కొంత సమయం గడిచిందని చెప్పడం కోసమే. అది సరిగ్గా కన్వే కాదేమో అని.. రాసేటప్పుడు అనిపిస్తూనే ఉంది కూడా. 

దాన్ని కాంపెన్సేట్‌ చెయ్యడం కోసం ఆ వెంటనే.. యశ్వంత్‌ అలసటగా నవ్వాడు అని రాయవలసి వచ్చింది. అయితే ఆ ‘అలసట’ కూడా కన్వే చేసినట్లు లేదు! 

‘ఐదు నిముషాల తర్వాత ఆమె హుక్స్‌ పెట్టుకుంటూ’ అని రాయాలని అనుకున్నా.. అసలు నిముషాల లెక్క ఎందుకు అని అనిపించడం అలా రాయకపోవడానికి కారణం. 

ఇవన్నీ ఒక ఎక్స్‌ప్లనేషన్‌గా ఆ రీడర్‌తో చెప్పినప్పుడు.. ‘‘ఇట్స్‌ ఓకే. కానీ ఓ చోట గుండె ఝల్లుమంది తెలుసా?’’ అని నవ్వారు. 

నాకు తెలియకుండానే కథల డెవిలీకరణ మెల్లిగా మొదలైందన్నమాట!

రామ్‌ సర్‌ ఆత్మ శాంతించడం కూడా :)

(మరో దెయ్యం కథ మళ్లెప్పుడైనా.. కాస్త టైమ్‌ దొరికినప్పుడు)


Friday, September 16, 2022


దెయ్యం కథలు మొదలయ్యాక, నేను రాసిన రెండో కథకే డీలా పడిపోయారు రామ్‌ సర్‌! ఆ రెండో కథే.. ఈ.. ‘జినియా పువ్వు’

‘‘ఇది కాదురా దెయ్యం కథంటే’’ అన్నారు రామ్‌ సర్‌.

సండే బుక్‌ని చేత్తో పట్టుకుని దెయ్యం కథ చదువుతుంటే.. రెండు మూడు పేరాలకే ఆ బుక్‌ని అక్కడ పడేసి, భయంతో కేకలు వేస్తూ ఉన్నచోటు నుంచి పరిగెత్తిపోవాలి.. అనేవారు ఆయన.  

లేదా..

కథ చదువుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారైనా తలతిప్పి వెనకెవరైనా ఉన్నారేమో భయం భయంగా చూసుకోవాలి.. అనేవారు.

లేదా.. 

ఒంట్లో వణుకు బయల్దేరాలి, అరిచేతులు చెమట్లు పట్టాలి.. గొంతు తడారిపోవాలి.. పెదవులు ఎండిపోవాలి.. ఇలాగనేవారు. 

ఇవేవీ జరక్కున్నా.. కనీసం.. ఈ కథలో దెయ్యం ఎవరు అనే క్వొశ్చన్‌.. కథ చదువుతున్నంత సేపూ భయంలా వెంటాడాలి.. అనేవారు. 

నేను మౌనంగా ఆయన ముఖంలోకి చూసేవాణ్ని. 

‘‘దెయ్యం కథ చదివాక దెయ్యం పట్టినట్లు అయిపోవాలి మాధవ్‌..’’ అనేవారు. 

నాకర్థమైంది. 

దెయ్యం కథ 13 డివైడెడ్‌ బై 6 అనే భాగహారంలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ‘దెయ్యం కథ నువ్వెంత అద్భుతంగా రాసినా, అదంతా భాగహారం కుడి చెవిలోని 2 మాత్రమే. అది నాకు అక్కర్లేదు. శేషంగా 1 మిగులుతుంది చూడూ.. అది నాకు కావాలి. అదే నేను కోరుకునే దెయ్యం. ప్రతి కథలోనూ చివరికి శేషంగా ఒక్క దెయ్యమైనా కనిపించాలి. ఆపైన ఎన్ని దెయ్యాలను శేషంగా మిగిల్చినా నీ ఇష్టం’ అని ఆయన నాకు చెబుతున్నారు! 

‘‘సరే, ఈ జినియాపువ్వు’ను ఇలా పోనివ్వు. వచ్చేవారం నుంచి నాకు పూలు, చేలు కాదు.. ఒర్జినల్‌ దెయ్యం కావాలి’’ అని, ఆ వారానికి కరుణించేశారు రామ్‌ సర్‌.. రాసిన కథనే మళ్లీ తిప్పి రాయమని అనకుండా. 

మొదట నేను కథ రాస్తాను. రాసిన కథను రామ్‌ సర్‌ క్యాబిన్‌లోకి తీసుకెళతాను. కథ రాగానే రామ్‌ సర్‌ మిగతా స్టాఫ్‌నందర్నీ క్యాబిన్‌లోకి పిలుస్తారు. ‘ఇక చదువు’ అని నా వైపు చూస్తారు. ఆయన చదవరు. చదువుతుంటే కథను ఫీల్‌ అవుతారు. చదువుతున్నప్పుడే అవసరమైన మార్పులు చెప్పేస్తారు. కథ విన్నాక క్యాబిన్‌లో ఉన్నవాళ్లందరి వైపు చూస్తారు.. ‘ఎలా ఉంది కథ?’ అన్నట్లు. క్యాబిన్‌లో అంతా సహృదయులే కనుక (నా అదృష్టం కొద్దీ కాదు, నా దెయ్యం కథ అదృష్టం కొద్దీ) బాగుందన్నట్లుగా మౌనం వహిస్తారు. 

ఆ తర్వాత.. 

కథ మేకప్‌ అవడం రెండో దశ. ఇచ్చిన దెయ్యం టెక్స్ట్‌ ఇచ్చిన దెయ్యం టైటిల్, ఇచ్చిన దెయ్యం ఇలస్ట్రేషన్‌తో డిజైనర్‌ ఆ దెయ్యం కథను మేకప్‌ చేస్తారు. 

ఆ తర్వాత...

మేకప్‌ అయిన ఆ దెయ్యం కథ ప్రింట్‌ను ముందేసుకుని చదవడం మూడో దశ. ముందేసుకుని ఎవరు చదువుతారంటే.. ఫన్‌డే సెక్షన్‌లో ఉండే సబ్‌ ఎడిటర్‌ ఒకరెవరైనా. జనరల్‌గా ఆ ఒకరెవరైనా ‘నిఖిత’ అవుతుంటారు. తను రిపోర్టర్‌ కమ్‌ సబ్‌ ఎడిటర్‌. 

కథను చదువుతూ చదువుతూనో, చదివేశాకో నిఖిత నుంచి నా ఇంటర్‌కమ్‌కి ఫోన్‌.. ‘కథ భలే ఉంది సర్‌..’ అని!

‘‘కథ చదువుతుంటే.. ఎక్కడైనా భయం వేసింది నిఖితా?’’ అని ఆశగా అడిగాను. 

‘‘లేదు సార్‌’’

‘‘తర్వాతేం జరుగుతుంది’’ అనిపించిందా?’’ 

‘‘లేదు సార్‌’’

‘‘క్లైమాక్స్‌ ఏమిటో తెలిసిపోతోందా?’’

‘‘లేదు సార్‌’’

‘‘మరి?!!’’

‘‘జినియా పువ్వు సర్‌..’’ 

నవ్వాను. 

కథలోని దెయ్యాన్ని వదిలేసి, కథలోని జినియాపువ్వుతో కనెక్ట్‌ అయ్యారు నిఖిత. 

కథలోని జినియాపువ్వు లాంటి దెయ్యం కాకుండా, దెయ్యం లాంటి జినియాపువ్వు నిఖితను పట్టేసింది అని చెప్పేందుకు లేదు. 

జినియాపువ్వు నిఖితకు నచ్చడానికి ఆమె చెప్పిన కారణం వేరే. 


(మరో దెయ్యం కథ మళ్లెప్పుడైనా.. కాస్త టైమ్‌ దొరికినప్పుడు)


Tuesday, September 13, 2022



‘‘ఇం
దులో లాజిక్‌ తప్పింది సర్‌’’ అన్నారొక రీడర్‌ ఫోన్‌ చేసి! పై కథ చదివాక. 
అప్పటికింకా మధ్యాహ్నమే. పేపర్‌లు మార్కెట్‌లోకి వచ్చి అప్పటికి  ఐదారు గంటలు అయుంటుంది. 
అంతలోనే ఒక రీడర్‌ ఈ కథను (హారర్‌ బిగిన్స్‌..) చదివేయడం, ఆఫీస్‌కి ఫోన్‌ చేయడం, వాళ్లిచ్చిన నెంబర్‌ పట్టుకుని నాకు ఫోన్‌ చేయడం, ‘‘ఇందులో లాజిక్‌ తప్పింది సర్‌’’ అనేయడం.. ఇన్ని జరిగాయంటే, ప్రపంచాన్ని మనం కొంతమందిమి నిందిస్తున్నట్లుగా.. అందరూ వాట్సాపుల్లో ఏమీ మునిగి తేలడం లేదు. 
పేపర్లు చదివేవారున్నారు. ఆ పేపర్‌లతో పాటు ఆదివారం పూట వచ్చే అనుబంధాల పుస్తకాలను తిరగేసేవారున్నారు. వాటిల్లో వచ్చే కథలతో పాటుగా, దెయ్యాల కథల్ని కూడా సీరియస్‌గా తీసుకునేవారూ ఉన్నారు!!
సో.. రామ్‌ సర్‌ కరెక్టే.
రామ్‌ సర్‌ అప్పుడు మా ఫీచర్స్‌ ఎడిటర్‌. 
సాక్షి ‘ఫ్యామిలీ’, సాక్షి ‘ఫన్‌డే’, సాక్షి ‘సినిమా’ వీటిన్నిటికీ కలిపి ఆయన హెడ్డు. హెడ్డు కనుక..‘నువ్విది రాయి’ అంటే మనం అది రాయాల్సిందే. 
‘‘దెయ్యం కథల్ని నువ్వు రాయి’’ అన్నారు నన్ను ఆయన.
‘నేను రాయను’ అనలేను కనుక.. ‘‘ఫన్‌ డేలో మనం దెయ్యాల కథల్ని వేస్తే రీడర్స్‌ పేజ్‌ తిప్పేస్తారేమో సార్‌..’’ అని మాత్రం అనగలిగాను.
‘‘రాసేలా రాస్తే ఎందుకు తిప్పేస్తారు?’’ అన్నారాయన. 
రాసేలా రాయలేనని నాపై నాకు నమ్మకం. ఆ మాటే రామ్‌ గారితో అన్నాను.. ‘రాయలేను సర్‌..’’ అని.
ఆనాటి దెయ్యాల మీటింగ్‌లో (దెయ్యాల కథల్ని ప్రారంభించేందుకు జరుగుతున్న డిస్కషన్‌ మీటింగ్‌లో).. భాస్కర్‌ గారు, ఖదీర్‌ గారు, యాసిన్‌ సర్, యాకూబ్‌ గారు.. మరికొందరు మిగతావాళ్లు ఉన్నట్లు గుర్తు.  
రామ్‌ గారిలో ఒక సుగుణం ఉంది. ఆయన తన ఇగోను ఏమాత్రం హర్ట్‌ కానించుకోరు.
‘యు డు’ అని ఆయన అన్నారంటే..  డు డిడ్‌ అవాల్సిందే. డిడ్‌ డన్‌ అవాల్సిందే. 
ఆ రోజు కూడా రామ్‌ గారు ‘యు డు’ అన్నారు కానీ, నేను చేతులెత్తేశాను. 
ఆ టైమ్‌లో ఆయన ఇగోను కాపాడే బాధ్యతను అర్జెంటుగా ఎవరో ఒకరు తీసుకోవడం అవసరం అని ఖదీర్‌గారు గ్రహించినట్లున్నారు.. తనే చొరవగా ఆ బాధ్యతను తన స్వహస్తాల్లోకి తీసుకున్నారు. అంటే.. ‘దెయ్యం కథల్ని నేను రాస్తాను సర్‌’ అని కాదు. దెయ్యం కథల్ని  నా చేత రాయించేందుకు బంతిని స్పిన్‌ చేయడం!
ఖదీర్‌ గొప్ప ఆటగారు.
ఆయనేం చేశారో చూడండి. 
‘‘మాధవ్‌ దెయ్యం కథల్ని భలే రాస్తాడు సార్‌. ఫ్యామిలీలో మాధవ్‌ ఆ మధ్య ఒక దెయ్యం కథ రాస్తే, విజయవాడ ఎడిషన్‌లో ఒక సబ్‌ ఎడిటర్‌ అది చదివి, ఆ రాత్రి డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్లడానికి భయపడ్డాడట..’’ అని రామ్‌ గారితో అని, ‘‘మీరు తప్ప దెయ్యం కథల్ని ఇక్కడ ఎవరూ రాయలేరు..’’ అని నా వైపు తిరిగి అన్నారు! ఇక్కడ అంటే హైదరాబాద్‌లో అని కాదు.  హైదరాబాద్‌లో ఉన్న సాక్షి హెడ్‌ ఆఫీస్‌లో అని కాదు. ఆ దెయ్యాల మీటింగులో ఉన్నవాళ్లెవరూ రాయలేరని. 
రామ్‌ గారిలో ఉన్నట్లే ఖదీర్‌గారిలోనూ ఒక సుగుణం ఉంది. 
నిజం చెప్పి ఎవర్నీ సంతోషపెట్టరు. అబద్ధం చెప్పి ఎవర్నీ బాధపెట్టరు. ఆ రోజు మాత్రం రామ్‌ గారి ఇగోను సంతోషపెట్టడానికి నిజమో, అబద్ధమో చెప్పి ఉంటారని నాకనిపించింది. 
అలా నేను ఫన్‌ డేలో వారం వారం దెయ్యం కథలు రాయడం మొదలైంది. ప్రారంభ కథే ఈ.. ‘హారర్‌ బిగిన్స్‌’. 

‘‘ఇందులో లాజిక్‌ తప్పింది సర్‌’’ అన్నారొక రీడర్‌ ఫోన్‌ చేసి! దెయ్యాల కథల్లోని ఈ ప్రారంభ కథ.. ‘హారర్‌ బిగిన్స్‌..’ చదివి. 
‘‘దెయ్యాలు ఎలా ఉంటాయో చూడాలని ఒక దెయ్యం అనుకోవడం ఏమిటి? అందుకోసం శ్మశానాలు, పాడుబడిన ఇళ్లలో తిరగడం ఏమిటి? దెయ్యాలను చూపించమని భూత వైద్యుడిని కలవడం ఏమిటి!.. నో లాజిక్‌..’’ అని ఆ రీడర్‌. 
‘‘దెయ్యాలు ఎలా ఉంటాయో చూడాలని అన్వేషించే క్రమంలో ఒక మనిషి శ్మశానంలోనో, పాడుబడిన ఇంటిలోనో దెయ్యాన్ని చూసి, గుండె ఆగి చనిపోయి, ఆ తర్వాత దెయ్యమై, దెయ్యం అయిన తర్వాత కూడా తనింకా మనిషినేననుకుంటూ దెయ్యాల కోసం తన అన్వేషణను కొనసాగించాడని అనుకోవచ్చు కదా.. కేవలం లాజిక్‌ కోసమైతే..’’ అని నేను ఆ రీడర్‌తో అనలేదు. 
‘‘నిజమే లాజిక్‌ తప్పింది..’’ అన్నాను. 
‘‘లాజిక్‌ తప్పినా కథ బాగుందనిపించింది’’ అన్నారు ఆ రీడర్‌. 
బాగుందా?! బాగుందనిపించిందా?! 
లైఫ్‌లో కొన్ని ఇలాగే ఉంటాయి. ‘అనిపించినట్లు, ‘అనిపించనట్లు’ అని మాత్రమే చెప్పగలిగేటట్లు. 

(మరో దెయ్యం కథ మళ్లెప్పుడైనా.. కాస్త టైమ్‌ దొరికినప్పుడు)